ఆంధ్రప్రదేశ్‌ - అద్దె సచివాలయం

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర తాత్కా లిక సచివాలయాన్ని మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో 20 ఎకరా లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.180 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో రూ.90 కోట్లు వడ్డీలేని రుణం ఇస్తారని, మరో రూ.90 కోట్లు రుణాలు తీసుకొని సిఆర్‌డిఎ నిర్మాణాలను పూర్తి చేస్తుందని, నిర్మాణం పూర్తయి, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ భవనాలలోకి వచ్చిన తర్వాత, ఆయా ప్రభుత్వ శాఖలు వినియోగించుకున్న విస్తీర్ణాన్ని బట్టి సిఆర్‌డిఎకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ సంస్థ నిర్మిస్తున్న సచివాలయానికి ప్రభుత్వ శాఖలు అద్దె చెల్లించాలని ప్రకటిం చటం ఆశ్చర్యం కలిగించే అంశం. తాను కట్టుకున్న భవనానికి తాను అద్దె చెల్లించటం ఏమిటి? అద్దె చెల్లిస్తే ఇప్పటికే నిర్మించబడి, వినియోగానికి సిద్ధంగా ఉన్న మేధాటవర్స్‌ లాంటి భవనాలు ఎక్కడైనా దొరుకుతాయి కదా! ప్రభుత్వానికి శ్రమ లేకుండా అద్దె చెల్లించి వినియోగించుకోవచ్చు. భవనాన్ని నిర్మించే భారం ప్రభుత్వానికెందుకు? నిర్మించిన భవనాలను అద్దె చెల్లించి వినియోగించుకున్న ప్రభుత్వం శాశ్వత సచివాల యం నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భవనాలను అమ్మేస్తామని చెబుతున్నారు. రాజధానిలో తాత్కాలిక సచివాల య నిర్మాణానికి అప్పులు చేయాల్సిన అవసరమేమిటి? రాజధాని నిర్మాణానికి చట్ట ప్రకారం రావాల్సిన కేంద్ర ఆర్థిక సహకారాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగదు? సింగపూర్‌, జపాన్‌, చైనా, తదితర దేశాలకు వెళ్ళి, తన కృషి ద్వారా రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొస్తున్నానని చెబుతున్న చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన మొత్తాన్ని, విభజన చట్టం ద్వారా మన రాష్ట్రానికి రావలసిన మొత్తాన్ని ఇవ్వమని అడిగే విషయంపై ఎందుకు శ్రద్ధ పెట్టటం లేదు? రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ ఖర్చును ఎందుకు భరించటం లేదు? ఈ విషయాలను పరిశీలిస్తుంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారమే ఈ అద్దె అంశాన్ని ముందుకు తెచ్చిందని స్పష్టమౌ తున్నది. రాజధాని ప్రాంతంలో ప్రతి పనికీ, ప్రజలకు అందా ల్సిన ప్రతి సేవకూ రుసుం చెల్లించటానికి ప్రజలను సన్నద్ధం చేయటం, ప్రభుత్వమే ఆఫీసులకు అద్దె చెల్లిస్తుంటే సామాన్యులు చెల్లించకుండా ఎలా అని ప్రజలను మభ్యపెట్ట టానికి, రాజధానికి రానున్న దేశ, విదేశీ కంపెనీలు ప్రజలను కొల్లగొట్టుకు తినటానికి కావలసిన ప్రాతిపదికను ఏర్పాటు చేయటానికి రూపొందించినదే ఈ సచివాలయ నిర్మాణానికి రుణం తీసుకోవటం, దాన్ని వినియోగించుకున్నందుకు అద్దె చెల్లించటం.
భవన నిర్మాణ ప్రతిపాదన, దాన్ని ఆమోదించిన పద్ధతి కూడా విచిత్రంగానే ఉన్నాయి. తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించటం అవసరమా, కాదా, నిర్మించాలా, లేదా అనేది నిర్ణయించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. కానీ ఆశ్చర్యకరంగా సిఆర్‌డిఎ తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రతిపాదన చేసింది. తాత్కాలిక రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించా లని సిఆర్‌డిఎ ప్రతిపాదించాల్సిన అవసరమేమిటి? గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ప్రతిపాదన వచ్చినప్పు డు కొద్దిరోజుల్లో శాశ్వత నిర్మాణాలు జరగబోతుంటే తాత్కాలిక నిర్మాణాలు అనవసరమని, గన్నవరం దగ్గరలో ఉన్న మేధా టవర్స్‌ లేదా మరో చోట అద్దెకు తీసుకుని సచివాలయాన్ని నిర్వహించుకోవచ్చని భావించి, ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనను తిరిగి సిఆర్‌డిఎ ద్వారా రంగంలోకి తీసుకురావటం, ఆమోదించటం జరిగిన తీరు అనుమానాలకు ఆస్కారమిచ్చేదిగా ఉంది. రాజధానిలో ప్రభుత్వానికి అవసరమైన ప్రధాన భవనాల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.20 వేల కోట్ల లోపుగానే ఉంటుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. రాష్ట్ర విభజన సందర్భంలో ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు రాజధాని నిర్మాణానికి రాష్ట్రానికి కేంద్రం ఐదు లక్షల కోట్ల రూపాయలివ్వాలని డిమాండు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాజధాని నిర్మాణ బాధ్యతలను నిర్వహించాల్సి వచ్చినప్పుడు కేంద్రాన్ని నిధులు డిమాండు చేయటానికి కూడా ఆయన సిద్ధం కావటం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, చట్టపరంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను తెచ్చుకోవటానికి కేంద్రాన్ని డిమాండు చేయటం, కేంద్రం సక్రమంగా స్పందించకపోతే ఆందోళనకు దిగటం, అప్పటికీ దారికి రాకపోతే ప్రజలను, ప్రతిపక్షాలను కూడగట్టుకొని ఒత్తిడి తీసుకురావటం మన హక్కును సాధించుకోవటానికి సరైన పద్ధతి. కానీ వీటిలో ఏ ఒక్క పని చేయటానికీ చంద్రబాబునాయుడు సిద్ధం కావటం లేదు. గతంలో యన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపితే అందుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, వామపక్షాలతో కలిసి పోరాడి రాష్ట్ర హక్కులను సాధించుకున్న చరిత్ర టిడిపి ప్రభుత్వానికి ఉంది. అటువంటి పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈనాడు కేంద్రం అంటేనే భయపడుతున్నట్లుగా వ్యవహరించటం సిగ్గుచేటు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రులను కేంద్రంలోని కాంగ్రెస్‌ అధిష్టానం ఇష్ట మొచ్చినట్లుగా అవమానిస్తుంటే అందుకు వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడి, అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఎటువంటి దుస్థితికి దిగజారిందనేది రాజధాని నిర్మాణ విషయంలో స్పష్టమౌతున్నది. కేంద్రాన్ని డిమాండు చేసి, మన హక్కుగా రావలసిన నిధులను సాధించటానికి ధైర్యంలేని ప్రభుత్వం విదేశీ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా రాజధానిలో కల్పించే ప్రతి సదుపాయం మీదా పెద్ద మొత్తంలో యూజర్‌ ఛార్జీలు, వివిధ రకాలైన రుసుముల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు వేయటానికి ప్రణాళికలు రూపొంది స్తున్నది. ఈ వ్యాపార ధోరణి చూస్తుంటే కేంద్రాన్ని గట్టిగా నిధులు డిమాండు చేయకపోవటానికి మరో కారణం కూడా ఉందేమో అనిపిస్తున్నది. కేంద్రాన్ని గట్టిగా డిమాండు చేసి, పెద్ద మొత్తంలో నిధులు సాధిస్తే, కేంద్రం నిధులిచ్చింది కాబట్టి ప్రయివేటు కంపెనీలు, విదేశీ సంస్థలతో అవసరమేమిటి అనే ప్రశ్న రావచ్చు. అప్పుడు విదేశీ కంపెనీలతో కలిసి వ్యాపారం చేయటం, లాభాలు దండుకోవటానికి అవకాశం ఉండదని, ప్రజలపై భారాలు వేయటం సాధ్యం కాదని భావించటం కూడా కారణం కావచ్చు.
ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఎక్కువ మంది రైతులను ప్రత్యక్షంగా, పరోక్షంగా భయపెట్టి, కొందరిని ఒప్పించి 33 వేల ఎకరాల భూములను భూ సమీకరణ పద్ధతి ద్వారా సేకరించింది. రైతుల నుంచి సేకరించిన భూమిని విదేశీ కంపెనీలకిచ్చి రాజధాని నిర్మాణం చేయించే ప్రయత్నం మినహా రాష్ట్రంలోని నిపుణులను, మేధావులను సంప్రదించటం లేదు. సింగపూర్‌ కంపెనీలు ప్లాన్‌ రూపొందించి, రాజధాని నిర్మించి ఇస్తాయని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరాచూస్తే సింగపూర్‌ కంపెనీలు పెడతామన్న పెట్టుబడి 300 కోట్ల రూపాయలు మాత్రమే. రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగలిగిన వారుగాని, 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగిన వారుగాని, రాజధాని నగరాన్ని నిర్మించగల నైపుణ్యం కలిగిన వారుగానీ ఆంధ్ర రాష్ట్రంలో లేరా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదు. అంత గొప్పగా సింగపూర్‌వారు నిర్మించి ఇచ్చారని చెబుతున్న ప్లాన్‌లో రైతులకివ్వాల్సిన భూముల విషయంలో స్పష్టత లేదు. తనకు రాజధాని నిర్మాణం బాధ్యతలు అప్పగించిన తర్వాత, రాజధాని ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరం వరకు మరే సంస్థా నిర్మాణాలు చేసుకోవటానికి అవకాశం ఇవ్వరాదని సింగపూర్‌ కంపెనీ షరతు పెట్టింది. చంద్రబాబు అంతకు ముందే అగ్రికల్చరల్‌ ప్రొటెక్షన్‌ జోన్‌ పేరుతో తాము రాజధానికి భూములు సేకరించిన సమీప ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాల కోసం భూములు కొనుగోలు చేయటానికి అవకాశం లేకుండా ఆంక్షలు విధించారు. అంటే రాజధానిలో గానీ, సమీపంలో గానీ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే తప్పనిసరిగా సింగపూర్‌ కంపెనీ వద్దకు వెళ్ళాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తున్నది. రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో నిర్మించే ప్రతి నిర్మాణానికీ, ప్రజలకు కల్పించే ప్రతి సదుపాయానికీ యూజర్‌ ఛార్జీలు వసూలు చేసుకొనే అవకాశాన్ని సింగపూర్‌ కంపెనీలకు ఇస్తున్నారు. పకడ్బందీగా రూపొందించిన వ్యాపార ప్రణాళిక ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. పూర్తిగా వ్యాపారులు, కాంట్రాక్టర్లతో నిండిపోయి, దేశ, విదేశీ పెట్టుబడిదారులతో కలిసి లాభాలు సంపాదించుకోవటానికి వెంపర్లాడుతున్న ఈ ప్రభుత్వం తీసుకొంటున్న ఏ చర్య ఎవరికి ప్రయోజనం కలిగిస్తుందో, తమపై ఏ భారాలు వేయటానికి దారితీస్తుందో అన్న అంశంపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
- ఎ. కోటిరెడ్డి