అభివృద్ధి మంత్రం - అసలు తంత్రం!

ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరా వతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందు కని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని అడిగారు. అమరావతిపై అనేకసార్లు ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్‌ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్‌పై చాలా ఆశలు పెట్టుకున్న మాట నిజమైనప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు. సింగపూర్‌పై ఆయన పెట్టుకున్న భ్రమలే పటాపంచలైనప్పుడు ఆయన ప్రజలకు కల్పించిన భ్రమలు నిజమయ్యే అవకాశమెక్కడీ మా సభ జరిగిన రోజునే గుంటూరులో అమరావతి మాష్టర్‌ప్లాన్‌పై సదస్సు భూములిచ్చిన రైతులు, స్థానికుల నిరసనలతో రసాభాసగా మారింది. అమరావతి అస్పష్టతలపై ఆందోళన ఎంత సహేతుకమో అర్థం కావడానికి ఇదో ఉదాహరణ. ప్రభుత్వం విడుదల చేసిన మాష్టర్‌ప్లాన్‌లో భూములిచ్చిన వారికి వాణిజ్య ప్లాట్లు ఎక్కడ ఇస్తారనేది చూపించలేదు. ప్రధాన వాణిజ్య ప్రాంతంలో గాక ద్వితీయ స్థాయి కేంద్రాలలో ఇస్తారన్నది కొన్ని పత్రికల్లో సూచించిన అంశం. రాజధానిని అమోఘంగా అభివృద్ధి చేసి ఆ ఫలాలు భూములిచ్చిన వారికే చెందేట్టు చేయాలన్నది తన ఆలోచనగా చంద్రబాబు చెప్పిం దానికి, మ్యాపులో చూపిందానికి ఎక్కడా పొంతనే లేదు.
ముఖ్యమంత్రి ఎక్కడకు వెళితే అక్కడ అద్భుతమైన చిత్రం చూపిస్తున్నారు. ఈ మధ్యనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం నగరాలను మూడు ప్రత్యేకతలతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. నిజానికి ఆ భౌగోళిక లక్షణాలు వాటికి ఇది వరకే ఉన్నాయి. పైగా అవి మూడు వందల సంవ త్సరాల చరిత్ర కలిగిన పట్టణాలు కూడా. గతంలో చంద్ర బాబు పాలించిన సమయంలోనూ అవి ఉన్నాయి. మరి కొత్తగా ఏ మంత్రదండంతో వాటిని మహత్తరంగా మార్చేయ బోతున్నారు? నరసరావుపేటను, తెనాలిని ఎక్కడకు వెళితే అక్కడ సింగపూర్‌గా చేస్తానని ఆయన చెబుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా హైదరా బాదు పాతబస్తీని ఇస్తాంబుల్‌(టర్కీ రాజధాని)గా మారుస్తా నని ఒకసారి ప్రకటించారు. హైదరాబాదును విశ్వనగరంగా చేశానని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. నిజాం కాలంలోనే అది విశ్వనగరం అని టిఆర్‌ఎస్‌ వాదిస్తుండేది. కానీ ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికల సందడి మొదలైనాక విశ్వనగరం మోత మరోసారి మొదలైంది. వరంగల్‌లోనూ, కరీంనగర్‌లోనూ కెసిఆర్‌ అలాటి వరాలే కురిపించారు. వెళ్లిన చోట నాలుగు మంచి మాటలు చెప్పడం సహజమే గానీ ఉన్న ఫళాన పట్టణాలు, నగరాలను ఎక్కడికో తీసుకువెళతామని బాధ్యత గల నేతలు మాట్లాడ్డం మాత్రం విడ్డూరం.
ఏ పట్టణం అభివృద్ధి అయినా అనేక భౌగోళిక, చారిత్రిక, ఆర్థికాంశాలపై ఆధారపడి ఉంటుంది. పంటల తీరు, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి కేంద్రాలు, రాజకీయ పాలనా సుస్థిరత, మత సంబంధాలు వంటి అనేక అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. తెలుగు రాష్ట్రాలలోనే చూస్తే రాజవంశాలు, రాజధానులు, విద్యా విజ్ఞాన కేంద్రాలు అనేక మార్పులకు గురవడం గమనించవచ్చు. ఇదంతా కేవలం పాలకుల ఇష్టాయిష్టాలను బట్టి జరిగింది కాదు. బ్రిటిష్‌వారు మొదట బందరులో కేంద్రం పెట్టుకోవాలనుకున్నారు. అందుకు అనుమతి లభించకపోవడంతో చెన్నపట్టణం తరలి వెళ్లి మద్రాసు రేపు పట్టణం నిర్మించుకున్నారు. వారి హయాంలో కోల్‌కతా, ముంబాయి, ఢిల్లీ కేంద్రాలుగా వివిధ కోణాలలో అభివృద్ధి చెందాయి. మొదటి దశలో వారి వాణిజ్య పంటలైన నీలిమందు, జనుము వంటి వాటికి కేంద్రంగా ఉన్న కోల్‌కతా తర్వాత ఆ రంగాలకు కాలం చెల్లిన ఫలితంగా పరిశ్రమలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ముంబాయిలో వస్త్ర పరిశ్రమ దెబ్బతినడం అనేక దుష్పరిణామాలకు దారితీసింది.
ప్రభుత్వ రంగ పరిశ్రమల స్థాపన కారణంగా హైదరాబాదు, విశాఖ పట్టణం పారిశ్రామిక కేంద్రాలైనాయి. గత రెండు దశాబ్దాలలోనూ సరళీకరణలో ప్రయివేటీకరణ కారణంగా ఆ పరిశ్రమల మూత హైదరాబాదును దెబ్బ తీసింది. అదే సమయంలో ఐటి కారణంగా నూతన అవకా శాలు కలిగినప్పటికీ అంతకు ముందుతో పోల్చడానికి లేదు. విశాఖ నగరం రేవు పట్టణం కావడం వల్లనూ, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వంటి భారీ సంస్థల కారణంగానూ హైదరాబాదులా మారకపోయినప్పటికీ ఇంతకు ముందున్న ఊపు తగ్గిన మాట కార్మికులకు తెలుసు. ఇతర అనేక పట్టణాలు, నగరాల్లో ప్రయివేటు ఫ్యాక్టరీల మూత వల్ల వేలాది మంది కార్మికులు వీధులపాలైనారు. జీవితాలు తలకిందులైనాయి. ప్రభుత్వాల పుణ్యాన వ్యవసాయరంగం కూడా చితికిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస రావడం సర్వసాధారణం కాగా అక్కడ కూడా భద్రతలేని కొలువులతో కూడిన అసంఘటిత రంగమే పెరిగిపోయింది. ఈ విధంగా రెండు విధాల దెబ్బతిన్న ఉపాధి పరిస్థితులకు ఆహార అభద్రత కూడా తోడైంది. సామాజిక అశాంతి పెరిగింది. వీటిని పరిష్కరించ కుండా అరచేతిలో వైకుంఠం చూపినట్టు ఆఘమేఘాల మీద అభివృద్ధి చేస్తామని చెప్పడం అర్థరహితం.
ఈ మధ్యన చెన్నరుని వర్షాలు ముంచెత్తినప్పుడు మన నగరాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తేటతెల్లమైంది. ఆ సమయంలో ఐటి సరఫరాలకు ఏర్పడిన అంతరాయాన్ని చూసినప్పుడు ఇప్పటికీ హైదరాబాదుకన్నా ఆ నగరమే కీలకంగా ఉందని చాలా మంది చెప్పుకున్నారు. క్షణాల మీద తరలించ గల ఔట్‌సోర్సింగ్‌ తరహా ఐటి ఉపాధిని అతిగా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కొన్నేళ్ల కిందట అమెరి కాలో ఆర్థిక సంక్షోభం రాగానే ఒక్కసారిగా తలకిందులైంది. ఐటి అభివృద్ధికి పరిమితులు ఏర్పడ్డాయనేది నిపుణులు చెబుతున్న మాట. అది సేవారంగమే తప్ప ఉత్పత్తి, ఉపాధి ప్రధానమైన రంగం కాదు. వాటిలో పని దొరికేది వృత్తినిపుణు లైన యువతకు మాత్రమే. వ్యవసాయ, ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే నిజంగా అభివృద్ధి సాధ్యం. ఇప్పుడున్న పరిస్థితిలో ఉత్పత్తిరంగం వాటా ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం కన్నా తక్కువగా ఉంది. చంద్రబాబు ఎంతగా చెప్పినా వ్యవ సాయ ప్రధానమైన రాష్ట్రంలో ఎక్కడా ఒక్కసారిగా ఉత్పత్తి పెరిగే అవకాశం లేదు. గతంలో ఆయన తీసుకున్న భూములు గాని, తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెద్ద ఎత్తున తీసుకున్న భూములలో గాని ఏ పరిశ్రమలు వచ్చి ఎంత ఉపా ధి పెరిగింది? వాటి వల్ల నిరాశ్రయులైనవారెందరు?
ఒకప్పుడు అమెరికాలో సబ్‌ప్రైమ్‌ సంక్షోభం పేరిట ద్రవ్య సంస్థలు కుప్పకూలితే ప్రపంచమంతా ఆ ప్రభావానికి గురైంది. యూరప్‌లో గ్రీసు, స్పెయిన్‌ వంటి దేశాలు గాని, ప్రపంచబ్యాంకు విధానాలు తొలుత అమలు చేసిన లాటిన్‌ అమెరికా దేశాలు గాని ఎంతటి అనర్థాలు ఎదుర్కొన్నాయో, ఎదుర్కొంటున్నాయో చూస్తున్నాం. ఆసియన్‌ పులులుగా చెప్పిన దేశాలూ ఒకప్పుడు అదే సంక్షోభం చవిచూశాయి. ఇప్పుడు ఏ దేశమూ మరో చోట భారీ ఉత్పత్తి సంస్థల స్థాపనకు సహాయపడే పరిస్థితి లేదు. ఉత్పత్తి ప్రక్రియలో వచ్చిన సాంకేతిక మార్పులు కూడా అలాగే ఉన్నాయి. ప్రధాని మోడీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రహసనం ఇంతవరకూ ఏం ఒరగ బెట్టింది?
ఈ నేపథ్యంలో స్మార్ట్‌ సిటీ మిషన్‌(ఎస్‌సిఎం) కూడా ప్రభుత్వ స్థలాలు, సగానికి పైగా స్థానిక సంస్థల భాగస్వా మ్యంతో ప్రయివేటు సంస్థలకు మేలు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ ఇన్‌ఫ్రా సంస్థలు అనేకం వేల కోట్లు ప్రభుత్వ సంస్థల దగ్గర రుణాలు తీసుకుని దివాళా ప్రకటించడమో, రుణగ్రస్తులుగా మిగిలి ఉండటమో జరి గింది. ఈ పథకంలో భాగంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పివి) ఏర్పాటు చేయాలని వచ్చిన ఆదేశాలను ముంబాయి మునిసిపల్‌ కార్పొరేషన్‌, పూణే, కొచ్చిన్‌, నాసిక్‌ తిరస్కరించాయి. ఎస్‌సిఎం 4.1.1,4.1.2 నిబంధనల వల్ల స్థానిక పాలన ప్రతిపత్తి దెబ్బతింటుందని తెలియజేశాయి. అంతేగాక వాటిలో పాలుపంచుకునే ప్రయివేటు సంస్థల తీరుతెన్నులు, అవి వసూలు చేసే వినియోగ ఛార్జీలపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలియదని కూడా నిపుణులు అంటున్నారు. సదుపాయాల పేరిట టోలుగేట్లు పెట్టి వాహన ధారులను, ప్రయాణీకులను పది కిలోమీటర్ల కొకసారి పీడించడం అనుభవైకవేద్యమే. విజయవాడ బస్‌స్టాండులో మూత్ర విసర్జనకు కూడా స్త్రీపురుషుల దగ్గర బోర్డుకట్టి మరీ అయిదు రూపాయలు వసూలు చేయడం, ముందు వారు టోకన్‌ కట్టేంత వరకూ నిరీక్షించేలా నిలబెట్టడం స్వచ్చభారత్‌ అవుతుందా? నయా అభివృద్ధి పేరిట ఏర్పాటు చేసే ఎస్‌పివి ల స్వరూప స్వభావాలపైనా స్పష్టత రావడం లేదు. అమరా వతి కోసం ఏర్పాటైన క్రిడా సంస్థకు విస్తారమైన అధికారాలు కట్టబెట్టారు గనకే ఇష్టానుసారం ఉత్తర్వులు విడుదల అవుతున్నాయి.
దేశ, విదేశ పెట్టుబడిదారులు రోజుకు ఒకరు వచ్చి విజయవాడలో, హైదరాబాదులో పాలకులతో మంతనాలు జరిపినంత మాత్రాన ఇక్కడ అభివృద్ధికి సహకరిస్తారను కోవడం పొరబాటు. పెట్టుబడులను ఆకర్షించడం తప్పు కాదు గాని దానికి శాస్త్రీయ ప్రాతిపదిక కావాలి. ఆ ప్రక్రియ పార దర్శకంగా ఉండాలి. కార్పొరేట్‌ సంస్థలకు, బినామీ దళారు లకు భూములు కట్టబెట్టినంత మాత్రాన పరిశ్రమలు రావని గత ఇరవై ఏళ్ల పరిణామాలు చెబుతున్నాయి. ఇసుక నుంచి ఇనము వరకు, ఎర్ర చందనం నుంచి బాక్సైట్‌ వరకూ ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి, భూములను చెరపట్టడానికి మాత్రమే ఇవి అక్కరకు వచ్చాయి. ఏవో ఆశలతో భూములు సేకరించి కృత్రిమంగా వాటి విలువ పెంచే ఎత్తుగడే ఇప్పుడు రాజ్యమేలుతుంది. అది కూడా పాలక కూటమిలో పెద్ద తలకా యల చుట్టూ తిరుగుతుంటుంది. కనుకనే పాలకుల ప్రచారా ర్భాటాలను ప్రశ్నించడం, ప్రజలకు నిజంగా మేలు జరిగే అభివృద్ధి నమూనా కోసం పోరాడటం తప్పనిసరి.
- తెలకపల్లి రవి