అడుగులో అడుగు వేస్తూ...

వంశధార నిర్వాసితుల పాదయాత్ర
కష్టాలను చెప్పుకోవడానికి బయలుదేరిన నిర్వాసితులు
మరో పోరాటానికి సిద్ధమైన బాధితులు
పాదయాత్రకు విశేష స్పందన

     వంశధార నిర్వాసితులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టిన వారు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో, పాదయాత్రకు సంకల్పించారు. ప్రజల్లోకి వెళ్లి తమపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. పునరావాసం, పరిహారం విషయంలో జరుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి సమాయత్తమయ్యారు. ప్రభుత్వ తీరుతో తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లను వివరించేందుకు బయలుదేరారు. పునరావాసం పూర్తి చేసిన తర్వాతే వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన గురువారం పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు జనం నుంచి విశేష స్పందన లభించింది.
పాదయాత్రను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి.తేజేశ్వరరావు ప్రారంభించారు. తొలిరోజు కొత్తూరు మండలం ఇరపాడు నుంచి మొదలైన యాత్ర హిరమండలం మండలంలోని దుగ్గుపురం, పాడలి, తులగాం ప్రాంతాల్లో సాగింది. గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు స్థానికులు అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రను అనుసరించారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షల పరిహారం చెల్లించాలని, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని, 18 ఏళ్లు నిండిన యువతకు ప్యాకేజీ ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ, గ్రామాల్లోని తోటి నిర్వాసితులను చైతన్యపరిచారు. పాదయాత్రలో వృద్ధులు సైతం పాల్గొని, ఎండలో నడస్తూ స్ఫూర్తిగా నిలిచారు. పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు.
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి
పాదయాత్రను ప్రారంభించిన అనంతరం చౌదరి.తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ప్రారంభించి పదేళ్లు గడుస్తున్నా, నేటికీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించలేదని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు ఇళ్ల పరిహారం కింద ఇస్తున్న రూ.53వేలతో ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగా ఇంటి నిర్మాణానికి రూ.3.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రాజెక్టుల్లో యువతకు ప్యాకేజీలిచ్చిన ప్రభుత్వం, వంశధార నిర్వాసితులపై వివక్ష చూపుతోందని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులు సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోరాడకపోతే మునిగిపోవడం ఖాయం
వంశధార నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడకపోతే ప్రభుత్వం ప్రాజెక్టు నీటిలోనే ముంచేస్తుందని నిర్వాసిత సంఘ నాయకులు భవిరి.కృష్ణమూర్తి హెచ్చరించారు. పదేళ్లు గడుస్తున్నా ఇళ్లకు పరిహారమూ ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలనూ చూపించలేదని చెప్పారు. వికలాంగులకు, వితంతువులకు చెల్లించాల్సిన పింఛన్‌నూ ఇవ్వడం లేదన్నారు. ప్రాజెక్టు వద్దని చెప్పడం లేదని, పునరావాసం, పరిహారం కల్పించిన తర్వాతే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారానే, నిర్వాసితుల సమస్యల పరిష్కారమవుతాయని తెలిపారు. పాదయాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని, ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలన్నారు. అదేవిధంగా పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల ఆరో తేదీన శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నేడు పాదయాత్ర సాగే ప్రాంతాలు
పాదయాత్ర శుక్రవారం ఉదయం బ్యారేజీ సెంటర్‌ నుంచి ప్రారంభం కానుంది. అక్కడ్నుంచి హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మీదుగా సరుబుజ్జిలి చేరుకుంటుంది. తొలిరోజు 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.నారాయణరావు, వంశధార నిర్వాసితుల సంఘం నాయకులు గంగరాపు.సింహాచలం, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జి.ఈశ్వరమ్మ, నిర్వాసితులు జె.రాజ్‌కుమార్‌, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.