స‌మ‌ర‌శీల ప్ర‌తిఘ‌ట‌న‌

                 శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార నిర్వాసితులు ఆదివారం సమరశీల ప్రతిఘటన చేశారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పోలీసు బలగాలతో పనులు చేయిస్తుండ టంపై తీవ్ర ఆగ్రహం చెరదారు. శనివారం తమ ఆందోళనా శిబిరాన్ని పోలీసులు కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు సెక్షన్‌ 30ని ధిక్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల కోసం అధికారులు వేసిన రేకుల షెడ్డును కూల్చివేశారు. అక్కడున్న పరికరాలను వంశధారలో పడేసి తమ నిరసనను ప్రభుత్వానికి చూపారు. అంతేకాదు స్థానిక తహశీలుదారును ఘెరావ్‌ చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాలకొండ ఆర్డీవో ప్రకటించారు. 
హిర మండలంలోని నిర్వాసిత గ్రామాలైన పాడలి, దుగ్గుపురం, తులగాం, గార్లపాడు నుంచి వేలాది మంది ర్యాలీగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆదివారం తరలివచ్చారు. పునరావాసం పూర్తిగా కల్పించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం కర్రలు చేతపట్టి మండుటెండను సైతం లెక్క చేయకుండా వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన ప్రవాహంలా చేరుకొని కదంతొక్కారు. ఈ ప్రాంతంలో ఆదివారం నుంచి సెక్షన్‌ 30ని పోలీసులు అమల్లోకి తెచ్చినా, ఏ మాత్రమూ బెదరకుండా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ర్యాలీగా హిర మండలంలోని బ్యారేజి సెంటర్‌కు చేరుకున్న ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పనులను అడ్డుకోవడానికి పరుగుపరుగున వెళ్తున్న వారిని అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసు బలగాలు ఆపడానికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా నిర్వాసితులకూ, పోలీసులకూ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో కొంతమంది మహిళలు పోలీసు వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకుపోయారు. ఉప్పెనలా వస్తున్న ప్రజలను అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. పోలీసు బందోబస్తుతో పనులు కొనసాగిస్తుండటం, తాము గత 39 రోజులుగా చేస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని పోలీసులు శనివారం కూల్చి వేయడండంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రాజెక్టు పనుల కోసం వేసిన రేకుల షెడ్‌నూ కూల్చేశారు. రేకులను నిర్మాణంలో ఉన్న అక్కడి వంశధార కాలువలో పడేశారు. 
తహశీల్దారు ఘెరావ్‌ 
అక్కడే ఉన్న హిరమండలం తహశీల్దారు జె.రామారావును నిర్వాసితులు చుట్టుముట్టారు. 'మాకు అన్యాయం జరగడానికి మీరే కారకులు' అంటూ ఘెరావ్‌ చేశారు. పోలీసులు రక్షణ వలయంగా నిలబడి తహశీ ల్దారును అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా, నిర్వాసితులు ఆయనను విడిచిపెట్టలేదు. ఈ సందర్భంగా 30 నిమిషాలపాటు జరిగిన పెనుగులాట జరిగింది. పోలీ సులు రక్షణగా ఉండి ఆయనను తహశీల్దారు కార్యాలయానికి తరలించారు. అనంతరం కూడా నిర్వాసితుల ఆగ్రహావేశాలు చల్లారలేదు. 
తిరిగి బ్యారేజీ సెంటర్‌కు చేరుకుని బత్తిలి-అలికాం రహదారిపై రాస్తారోకో చేశారు. వంశధార నిర్వాసితుల సంఘం నాయకుల జోక్యంతో ఆందోళన విరమించి ఇంటి బాట పట్టారు. నిర్వాసితుల ఆగ్రహజ్వాలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు పాలకొండ ఆర్‌డిఒ రెడ్డి గున్నయ్య ప్రకటించారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఆదివారం జరిగిన సంఘటనను ప్రభుత్వం హెచ్చరికగా భావించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే నిర్వాసితులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, వంశధార నిర్వాసితుల సంఘం నాయకులు కె.నారాయణరావు, జె.రాజ్‌కుమార్‌, జి.సింహాచలం, జి.సూర్యనారాయణ, భాస్కరరావు, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.