లాభాలు పెద్దలకు-రోగాలు ప్రజలకు..

చంద్రబాబు ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి జపం చేస్తున్నది. రెండంకెల అభి వృద్ధి సాధన కోసం ఎన్నుకున్న రంగా ల్లో కీలక మైనది ఆక్వారంగం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తా మని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యం గా పై మూడు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగానూ, అనధికారికం గానూ లక్షలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువు లుగా మారాయి. ఇంకా మారుతు న్నాయి. అన్నపూర్ణగా పేరొంది, దేశానికే తిండి గింజలను అందించే కృష్ణా, గోదావరి డెల్టాల్లోని వరిచేలు నేడు చేపలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఆక్వాసాగు ప్రజల జీవితాల మీద, పర్యావరణం మీద, నేలతల్లి మీద, నీటివనరుల మీద తన పంజా విసిరింది.
కొందరికేలాభం-మరెందరికో భారం
నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో వ్యవసాయంలో ఆహార పంటలు క్రమేపీ తగ్గి ఎగుమతి ఆధారిత పంటలు పెరిగాయి. అందులో భాగమే ఆక్వా సాగు పెరుగుదల. మొదట భూస్వాములు, ధనిక రైతులు ఆక్వాసాగు ప్రారంభించారు. చెరువుల్లో నిరంతరం ఉప్పు నీరు నిల్వ ఉంచడం, నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి ఉప్పు నీరు తోడటంతో చుట్టు ప్రక్కల ఉన్న భూములన్నీ చౌడు దేలాయి. దీనివల్ల వరి పంటల దిగుబడి బాగా పడిపోవడం లేదా అసలు వరి సాగుకు ఆ ప్రాంత భూములు పనికి రాకుండా పోవటమో జరిగింది. దీంతో పేదరైతులు తమ భూములను పెద్దలకు లీజుకివ్వటం అని వార్యమైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని ధనికులు (వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు) కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఆక్వా సాగులోకి వచ్చారు. వీరు ఒక్కొక్కరు వందల, వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ పలుకుబడి, అధికారం, అవినీతి అండతో నిబంధనలను కాలరాసి పంట కాలువలు, డ్రైనేజీ లను, ప్రభుత్వ, అసైన్డు భూములను తమ చెరువుల్లో కలిపేసుకున్నారు. పంటకాలువల్లో కిందకు నీరు పారక పోవడంతో సముద్రతీర ప్రాంతం నుంచి సెలినిటీ ఎగువ ప్రాంతాలకు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీంతో మొత్తం సారవంతమైన భూములు నిస్సారంగా మారిపో యాయి. ఒక వైపు పేదల భూముల మీద పెద్దలు లాభాలు దండుకుంటూ భూ యజమానులైన పేద రైతులకు ఎకరాకు రూ.35-40 వేలు మాత్రమే లీజు ఇస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వరి సాగు చేయాలంటే ధనికుల భూమి పేదలు కౌలుకు తీసుకుంటారు. అప్పుడు చట్టంలో ఉన్న (దిగుబడిలో 30 శాతం) దానికంటే ఎక్కువగా (25 నుంచి 28 బస్తాలు) కౌలురేటు ఉంటుంది. అదే ఆక్వా సాగు చేయాలంటే పేదల భూములు పెద్దలు లీజుకు తీసుకుంటారు. వీరు ఇచ్చే లీజు చట్టం కంటే తక్కువ ఉంటుంది. ఎకరానికి సుమారు నాలుగు టన్నుల దిగుబడి వస్తుందనుకుంటే రూ.80-95 వేలు కౌలు చెల్లించాలి. అంటే పెద్దల భూమి కౌలుకు తీసుకున్నా లేదా తన భూమిని పెద్దలకు లీజుకిచ్చినా నష్టపోయేది పేదవారే, లాభపడేది పెద్దలే. అందుకే బాబుకు ఆక్వా మీద (పెద్దల మీద )ప్రేమ ఎక్కువ. వారి లాభాలు పెంచడానికే తుందుర్రు లాంటి చోట్ల మెగా ఆక్వా శుద్ది పరిశ్రమలు రూపొందుతున్నాయి. 
ఉపాధికి మంగళం
ఒకనాడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఈ జిల్లాలకు వలసలు వచ్చేవారు. కానీ నేడు పరిస్థితి తారుమారయ్యింది. ఈ మూడు జిల్లాల్లో సుమారు ఐదు లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఈ భూమిలో వరి సాగయితే ఎకరాకు 80 నుంచి వంద పని దినాలు ఉపాధి దొరికేది. అదే ఆక్వా సాగుకు ముగ్గురు, నలుగురికే ఉపాధి దొరుకుతుంది. వరిసాగు పోయి ఆక్వా సాగు పెరగటం వల్ల ఈ జిల్లాలోని వ్యవసాయ కార్మికులు ఏటా సుమారు ఐదు కోట్ల పనిదినాలు కోల్పోయారు. సగటున రోజుకు రూ.120 కూలి లెక్కవేసినా సుమారు ఏటా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయారు. మరో గత్యంతరం లేక వలస పోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 9.67 శాతం మంది వలస వెళుతున్నారు. జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 39 లక్షలు అంటే మూడున్నర లక్షల మందికి పైగా వలసలు పోతున్నారు. నిన్న మొన్నటి వరకు తమకున్న అరకుంట, కుంటకు తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్న కౌలు రైతులు కూడా ఆక్వా సాగుతో భూముల నుంచి గెంటివేయబడ్డారు. సొంతభూమి, కౌలుకు చేస్తున్న భూమి చేజారి పోవడంతో ఉపాధి కోసం కౌలు రైతులు కూడా వ్యవసాయ కార్మికులతో కలిసి వలస బాటపట్టారు.
ప్రజల ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
విస్తారంగా పెరుగుతున్న చేపలు, రొయ్యల చెరువులు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల వ్యర్థ జలాలను పంటకాల్వల్లోకి నేరుగా వదులుతున్నారు. ఆ నీటి వల్ల భూమి, పంటకాలువలు, భూగర్భ జలాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఆక్వా సాగు వల్ల ఆ ప్రాంత నీటిలో నైట్రేట్‌ అధిక మోతాదులో ఉందని జెఎన్‌టియు కాకినాడు బృందం 2013లో చేసిన పరిశోధనలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ), భారతీయ ప్రమాణాల విభాగం (బిఐఎస్‌) నిబంధనల ప్రకారం తాగునీటిలో నైట్రేట్‌ ఒక లీటర్‌కు 49 మిల్లీగ్రాములు మాత్రమే ఉండాలి. నైట్రేట్‌ మోతాదు పెరిగిన నీటిని తాగడం వల్ల తెల్లరక్తకణాలు దెబ్బతిని, మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమేణా దెబ్బతిని రోగాల పాలవుతారు. ఈ నైట్రేట్‌ అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి ఆక్సిజన్‌ అందకుండా చేస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధినే ''బ్లూ బేబీ సిండ్రోమ్‌'' అంటారు. అంతే కాదు నైట్రేట్‌ కాన్సర్‌కు కూడా కారణం అవుతుంది. మరో ఆందోళనకరమైన విషయం ఏమంటే నైట్రేట్‌తో కలుషితమైన నీటిని మనం గుర్తించలేము. అంతలా నీటిలో కలిసిపోయే గుణం నైట్రేట్‌కు ఉంది. వాసన, రుచి ఉండదు. ప్రత్యేక పరీక్ష ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలం. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రజలు కాల్వలు, చెరువుల్లోకి వస్తున్న ఆ కలుషిత నీరే వాడుతున్నారు. లేదా ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలంటే మినరల్‌ వాటర్‌ను కొనుక్కోవాల్సిందే. ఈ ప్రాంతంలో నీరు తాగడానికేకాదు కనీసం వాడుకోవడానికి కూడా పనికి రాకుండా పోయింది. ఈ నీటితో స్నానాలు చేస్తే దురదలు ఇతర చర్మవ్యాధులు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ నీటిని తాగిన పశువుల పాల దిగుబడి తగ్గిపోతుండటంతో పశుగణం తగ్గిపోయింది. సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్‌) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది శిశువులకు 28 నుంచి 35 మంది మరణిస్తున్నారు. 75 నుంచి 80 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ప్రతి వెయ్యి మంది గర్భిణీలలో 75 నుంచి 80 మంది వరకు చనిపోతు న్నారు. దిగజారుతున్న ప్రజల ఆరోగ్యానికి, రోజురోజుకు విస్తరిస్తున్న ఆక్వా సాగువల్ల పెరుగుతున్న కాలుష్యానికి సంబంధం ఉంది. కాలుష్యానికి తోడు పేదల్లో పోషకాహార లోపం పరిస్థితులు అదుపు తప్పడానికి కారణమవుతోంది. ఉపాధిని మింగేసిన ఆక్వా సాగును విచ్చలవిడిగా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి.
ఇంకా ఎంత కాలం భరించాలి?
వ్యవసాయం గిట్టుబాటు కానప్పుడు రైతుకు నాలుగు రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వాసాగును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కొందరి వాదన. కానీ ఆ నాలుగు రూపా యలు సంపాదించేది కొద్ది మంది పెద్దలు మాత్రమే. ''కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచబాధగా ఉంటుంది'' అని శ్రీశ్రీ అన్నట్లు పెద్దలకు ప్రయోజనం జరిగితే అందరికీ ప్రయోజనమేనా? నిజానికి ఆక్వాసాగు ఫలాలు భూ యజమానులైన సన్న, చిన్నకారు రైతులకు అందటంలేదు. లాభాలన్నీ పెద్దల జేబుల్లోకే పోతున్నాయి. సంపద కొందరికే, రోగాలు అందరి కీ. ఇదీ కోస్తా ప్రాంతంలో రెండంకెల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ దత్త పుత్రిక ఆక్వా రంగం సృష్టిస్తున్న విలయ తాండవం. ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా ఇంకా ఆక్వా సాగు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించడం, వద్దని వేడుకుంటున్న ప్రజలపై కేసులు పెట్టడం రాబోయే మరో పెద్ద ప్రమాదానికి సంకేతం. అందుకే తుందుర్రు ప్రజలు మెగా ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా పెద్దయెత్తున పోరాడు తున్నారు. ప్రభుత్వ నిర్బంధాలను, అధికారపార్టీ నాయ కుల బెదిరింపులను లెక్కచేయకుండా ఉద్యమిస్తున్నారు. అంతేకాదు కాలుష్య కోరల నుంచి కాపాడాలని, అక్రమ తవ్వకాలు ఆపాలని ఈ జిల్లాల్లో ప్రజానీకం ఆందోళన బాటపట్టారు. ఫలితంగా ఈ ఏడాది అనేక చెరువులను తవ్వకుండా అడ్డుకున్నారు. అక్రమ చెరువులపై చర్యలు తీసుకుంటామని మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రకటించా ల్సి వచ్చిందంటే అందుకు ప్రజా ఉద్యమమే కారణం.
ప్రభుత్వం ప్రతి మనిషికీ సగటున 70 లీటర్ల రక్షిత నీటిని సరఫరా చేయాలి. పంచాయతీ చెరువుల్లో కాలు ష్యాన్ని తొలగించడానికి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. వలసలు అరికట్టడానికి స్థానికంగా 200 రోజులు ఉపాధి హామీ అమలు చేయాలి. భూమి లీజులకు ఇచ్చిన సన్న, చిన్నకారు రైతులందరికీ చట్టప్రకారం కౌలు ఇప్పించా లి. పెద్దలు ఆక్రమించిన ప్రభుత్వ, అసైన్డు భూముల లీజును పట్టాలు పొందిన దళితులు, ఇతర పేదలకు ఇవ్వాలి కొత్తగా చెరువులు తవ్వకుండా నిషేధిం చాలి. దళితులు, సన్న, చిన్నకారు రైతుల భూములు ఇప్పట ికే చెరువులుగా మారినందున వారు ఉమ్మడిగా సాగు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలు ఇప్పించాలి. ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టేలా ప్రజలు ఉద్యమించాలి.