మాటల కోటలు..

కేంద్రమంత్రివర్యులు వెంకయ్యనాయుడుగారు మరో మారు తన వాచాలతను ప్రదర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిట్‌ శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని విద్యార్థులు నినదించినదే తడవుగా ఆయనకు ఆగ్రహం కట్టలు తెగింది. హోదా విషయమై ప్రతిపక్షం వారి విమర్శలను సైతం మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఆవేశం, ఆక్రోశం కలగలిపిన స్వరంతో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష, పరనిందలతోనే సాగింది. వంటికి వేసుకొనే చొక్కా రంగు మొదలుకొని భుజాన మోసే పార్టీ జండా వరకు ఏకరువు పెట్టి రాజకీయాల్లో తానేవిధంగా స్వశక్తితో ఎది గారో గొప్పగా చెప్పుకున్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సందర్భంగా ఆయన ఆంధ్ర పక్షాన నిలబడి గట్టిగా మాట్లాడబట్టే రాష్ట్రానికి కొంతయినా లబ్ధి చేకూరిం దట. తాను రాష్ట్రానికి వస్తే ప్రాజెక్టు వస్తుందట. లేకపోతే రాదట. తనను రాష్ట్రానికి రానివ్వకపోతే ప్రాజక్టులే రావన్న బెదిరింపు ధోరణిలో మాట్లాడడం వెంకయ్య నాయుడి అహంకార పూరిత ధోరణికి నిలువెత్తు చిహ్నం మినహా మరొకటి కాదు.
ఒక్క వెంకయ్యనాయుడే కాదు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని నేతలంతా ప్రత్యేక హోదా కోసం గళం విప్పాలని, సాధించుకోవాలని ప్రజల ఆశ. కాకపోతే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విభజన సందర్భంగా నేతలు చేసిన వాగ్దానాల గురించి ప్రజలు నిలదీసినా, నిరసన తెలియచేసినా పాలకుల నుండి అసహనమే వ్యక్తమౌతోంది. ప్రత్యేక హోదా పేరెత్తితే చాలు! కేంద్రంలో పెద్దల అభ్యంతరాలు, కుంటి సాకులు చాంతాడంత ఉంటున్నాయి. కాసేపు ప్రణాళికా సంఘం రద్దయిందని, నీతి ఆయోగ్‌ వచ్చిందని చెప్తారు. మరికాసేపు ఆర్థిక సంఘం బూచి చూపిస్తారు. ఇంకాసేపు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంటులో ప్రకటనలు చేయిస్తారు. 'సెలెక్టివ్‌ ఆమ్నీషియా' రోగుల మాదిరిగా ఏలికలు ప్రవర్తించడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆనాడు పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రానికి మన్మోహన్‌సింగ్‌ అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా ప్రకటిస్తే... ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు పదేళ్లపాటు కావాలని డిమాండ్‌ చేశారు. ఇక చంద్రబాబు విశాఖ బహిరంగ సభలో 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో పగ్గాలు పుచ్చుకొని పెత్తనం వెలగబెడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదిహేను నెలలు గడిచిపోయినా ఇంతవరకు ప్రత్యేక హోదా గురించిగానీ, ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ నోరు మెదపడం లేదు. మొన్నటి దాకా డిమాండ్‌ చేసిన 'ప్రత్యేక' అంశాన్ని ఇవాళ గాలికొదిలేయడమే కాక వేదికల మీద ఒకరినొకరు అభినందించుకొంటూ ప్రజలను మోసగించ చూస్తున్నారు. క్లిష్ట సమయంలో చంద్రబాబు ఎంతో ఓపికతో ఉన్నారని వెంకయ్య అంటే... వెంకయ్య అభిమన్యుడిలా రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడారని బాబు అన్నారు. ఈ ఇద్దరూ కలిసి ప్రత్యేక హోదాపై నోరు మెదపని ప్రధానమంత్రి నరేంద్రమోడీని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. ఇదంతా చూస్తుంటే కాషాయపార్టీవారు, పచ్చ చొక్కా పార్టీవారు జంటగా జనాన్ని వెర్రివెంగళప్పలను చేయజూస్తున్నారని అర్థమౌతూనే ఉంది.
నూతన రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని నమ్మబలికిన కేంద్రం ఇంతవరకు నిధులే కేటాయించలేదు. కేంద్ర విద్యా సంస్థలు రెండు మూడింటికి శంకుస్థాపనలు చేసి అదే సర్వస్వం అంటున్నారు. లోటు బడ్జెట్‌ను కేంద్రమే భర్తీ చేస్తుందన్న మాట శుష్క వాగ్దానంగానే మిగిలిపోయింది. అదేమంటే గుంటూరు, విజయవాడ పట్టణాభివృద్ధికి వెంకయ్యనాయుడు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఏపీ రాజధానికి వంద కోట్లు కేటాయించారని గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు. విభజన వల్ల రాష్ట్రం సుమారుగా రూ.16 వేల కోట్ల లోటులో పడింది. వాటి గురించి ఒక్క మాట మాట్లాడకుండా రూ.3 వేల కోట్ల రూపాయల అంచనాలతో కేంద్ర విద్యాసంస్థలు మంజూరు చేశామని జబ్బలు చరుచుకొంటున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలిస్తామని ఊరించి అందుకు (ఏడు జిల్లాలకు) కేవలం 350 కోట్ల రూపాయలిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఒకటి రెండు ప్రాజక్టులతో నూతన రాజధాని ఏర్పడుతుందా? రెండు మూడు కేంద్ర విద్యా సంస్థలు పెడితే సరిపోతుందా? ఈ పద్ధతుల్లో అయితే రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు కావాలి? ఈ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలిస్తే అటు కమలం పార్టీ, ఇటు రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ రెండూ ఆంధ్రా ప్రజలకు ద్రోహం చేస్తున్నాయన్నది పచ్చి నిజం. రాష్ట్ర భవిష్యత్‌ కోసం హోదా ఇవ్వాలో, ప్యాకేజీ ఇవ్వాలో కూడా పాలకులకు స్పష్టత లేకపోవడమే బాధాకరం. రాజకీయ చిత్తశుద్ధి ఉండాలేకానీ నిధుల విడుదల పెద్ద కష్టమేమీ కాదు. నేతలు తక్షణం చేయాల్సింది తమను తాము నిజాయితీపరులుగా నిరూపించుకోవడమే. వాచాలతను పక్కన పెట్టి తాము చేసిన వాగ్దానాలను, ఇచ్చిన మాటలను నెరవేర్చుకోవడమే మిగిలింది.