మతోన్మాదంపై లౌకకవాద పార్టీలతో కలిసి పోరాటం

 బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్‌ సిపిఎం ఎమ్మెల్యే మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగామి విమర్శించారు.మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఆవాజ్‌ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామి మాట్లాడుతూ, ఎన్నో కలలు కన్న స్వాతంత్ర భారతదేశం నేడు లేదని ,మత ఛాందసవాదం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించేందుకే ప్రభుత్వం అసహనం పెరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. వాస్తవానికి ప్రజలు ఎంతో సహనంగా ఉన్నారని తెలిపారు.  బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌స్‌ అధికారం కోసమే తాపత్రయం పడుతున్నాయని విమర్శించారు. ముక్కలుకాని భారతదేశం కావాలని చెప్పారు. హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటే, ప్రమాదం తలపెట్టే వారికే ప్రమాదమని హెచ్చరించారు.