ప్రభుత్వమే ఓ భూకబ్జాదారు:కారత్

రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో టిడిపి ప్రభుత్వమే భూకబ్జాదారుగా మారిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ విమర్శించారు. భూసేకరణ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల, బ్రాహ్మణపల్లె, గడివేముల మండలం గని గ్రామాల్లో సోలార్‌ హబ్‌ కింద భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడేందుకు శుక్రవారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాలకు సంబంధించిన భూసేకరణలో ఎక్కడ భూసేకరణ జరిగినా 80 శాతం మంది నిర్వాసితులు గ్రామసభలో ఒప్పుకోవాలనే నిబంధన ఉందన్నారు. భూమిని తీసుకున్నాక పూర్తిస్థాయిలో వారికి పునరావాసం కల్పించాలని చట్టంలో ఉందన్నారు. మార్కెట్‌ విలువ ఆధారంగా నాలుగు రెట్లు పెంచి ఇవ్వాలనే నిబంధన ఉందని చెప్పారు. పార్లమెంట్‌లో చట్టం చేసినప్పుడు బిజెపి, టిడిపి ఎంపీలు అంగీకరించారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు చట్టాలను ఉల్లంఘించి రైతుల అభిప్రాయాన్ని తీసుకోకుండానే భూములను బలవంతంగా లాక్కుంటు న్నాయని విమర్శిం చారు.