ప్రజాసమస్యల పరిష్కారానికి కేంద్రంగా సుందరయ్యభవన్‌

కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి గాడిదమళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పాశం రామారావు మాట్లాడుతూ చేజర్ల గ్రామంలో సిపిఎం నిర్మాణం పటిష్టంగా ఏర్పడాలని, ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిరంతరం పనిచేయాలని సూచించారు. గ్రామంలోని రైతులు, కూలీలు, కౌలురైతులు, దళితులు, మైనార్టీలు, చేతివృత్తిదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ప్రజా పోరాటాలకు సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుందన్నారు. కార్యాలయంలో ఆయా ప్రజాసంఘాల వారు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సదస్సులు, సమావేశాలు జరుపుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోనే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలు ఏర్పడి మూడున్నర సంవత్సరాలైనప్పటికీ గత ఎన్నికలలో చేసిన వాగ్ధానాలు నేటికీ ఒక్కటి కూడా అమలు జరపలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా రైతులు అప్పులఊబిలోకి కూరుకుపోయారని అన్నారు. దేశంలో గత మూడున్నర సంవత్సరాలకాలంలోల 37వేలమంది రైతులు ఆత్మహత్యలుచేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు పార్లమెంట్‌ ఎదురు చనిపోయిన ఎలుకలను నోట్లో పెట్టుకుని నిరసన తెలుపుతున్నారంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగాఉందో అర్ధమవుతుందన్నారు. డేరా బాబా లాంటివారికి రామ్‌దేవ్‌బాబా లాంటి వారికి బిజెపి అండదండలు ఉన్నాయని పేర్కొన్నారు. మతోన్మాద దాడులను నికరంగా వ్యతిరేకిస్తున్న సిపిఎం కార్యకర్తలపై, నాయకులపై, కార్యాలయాలపై దాడులకు పూనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2కోట్లు ఉద్యోగాలు కల్పిస్తానని చేసిన వాగ్ధానం ప్రకారం 7కోట్లమందికి ఉద్యోగాలు కల్పించాల్సిన కేంద్రప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తగ్గించేపనిలో ఉందన్నారు. ప్రజా సమస్యల కోసం జరిగే పోరాటాలలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ జిఎస్టీ వల్ల కార్పొరేట్‌ కంపెనీలు గతంలో 48శాతం పన్నులు కట్టాల్సి ఉండగా జిఎస్టీ వచ్చిన తర్వాత అవి 28శాతానికి తగ్గిపోయాయని వివరించారు. ఆవిధంగా కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూర్చిందన్నారు. మరొకవైపు వినియోగదారులపై పెనుభారం మోపుతుందని విమర్శించారు. పంటల భీమా యోజనపథకం ద్వారా గత మూడు సంవత్సరాలుగా పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందజేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహించే పోరాటాలలో ప్రజానీకం అంతా భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు.