ప్రజాసమస్యల పరిష్కరానికై విజయవాడలో ప్రజారక్షణ పాదయాత్ర

సిఎం చంద్రబాబు పాలన వ్యాపారమయంగా మారిపోయిందని, పౌర సేవలను డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ యాత్ర ఆదివారం విజయవాడలోని 45వ డివిజన్‌ మధురానగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు పాలకులు చేస్తున్న అన్యాయాలను వివరించడానికి చేపట్టిన ప్రజారక్షణ యాత్రకు అందరూ మద్దతు తెలిపాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ సామాన్యులు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా నాయకులకు పన్నులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టిడిపి పాలనలో ఏర్పడిందన్నారు. ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలిచిపోయే అమరావతి నగరాన్ని నిర్మిస్తానంటూ చెబుతున్న చంద్రబాబు విజయవాడలో ఒక్క ఫ్లైవోవర్‌ను కూడా నాలుగేళ్ల పాలనలో పూర్తి చేయలేకపోయారని, ఇక అమరావతిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డప్పు వాయించి యాత్రను ప్రారంభించారు. యాత్రకు సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం వెస్ట్‌కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, నాయకులు బోజెడ్ల నాగేశ్వరరావు, కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి పాల్గొన్నారు.