నూతన మద్యం విధానంపై నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానాన్ని నిరసిస్తూ మంగళవారం విజయవాడ బీసెంట్‌ రోడ్డులో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మద్యం భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 'నూతన మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలి, వద్దు వద్దు మద్యాంధ్రప్రదేశ్‌, మంచినీరు నిల్‌-మద్యం పుల్‌' అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.ముందుగా సిపిఎం నగర కార్యాలయం నుంచి ఆందోళనకారులు ప్రదర్శనగా బీసెంటర్‌ రోడ్డులోని అన్సారీపార్కు వద్దకు చేరుకున్నారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు డి.విష్ణువర్ధన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ, ప్రజల జీవితాలు, వారి ప్రాణాలతో చెలగాటమాడే నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలైన కందిపప్పు, పామాయిల్‌, ఇతర సరుకులను సరఫరా చేయలేని ప్రభుత్వం.. నూతన విధానం ద్వారా మద్యాన్ని ఏరులై పారించి, దాని ద్వారా వచ్చే ఆదాయంతో పరిపాలన చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కె.శ్రీదేవి, నగర కార్యదర్శివర్గ సభ్యులు యువి రామరాజు, మాదల వెంకటేశ్వరరావు, జి.నటరాజు తదితరులు పాల్గొన్నారు.