గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దు

సాలూరు మండలంలో గ్రానైట్‌ తవ్వకాలకు లీజు అనుమతులు ఇవ్వొద్దని తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండు చేశారు. గురువారం ఆ కమిటీ కన్వీనర్‌, గిరిజన సంఘం, నాయకులు ఎం.శ్రీనివాసరావు అధ్వర్యాన రామస్వామిడ వలస, వల్లాపురం, సీతందొరవలస గ్రామాలకు చెందిన గిరిజనులు తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రిలే నిరహార దీక్షలు ప్రారంభిం చారు. దీక్షలనుద్దేశించి భూ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ గేదెల సత్యనారాయణ మాట్లాడారు. తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట ప్రాంతాల్లో గ్రానైట్‌ తవ్వకాల కోసం ప్రధానరాజకీయ పార్టీల అండతో కొంతమంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారన్నారు. ఇక్కడ గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులిస్తే చుట్టూ వున్న గిరిజన రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. 15 గ్రామాల గిరిజనులు కొండల చుట్టూ నివసిస్తున్నారని, కొండలపై పడిన వర్షపు నీరు 35 చెరువులు, పదిగెడ్డలకు చేరడంతో వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారని అన్నారు. 750 ఎకరాలకు నీరందించే పావురాయి గెడ్డ మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి వీలుపడదన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ తవ్వకాల వల్ల వన్య ప్రాణులు నాశనమవుతాయన్నారు. ఈ ప్రాంతంలో వెలిసిన కొండబైరవ, సంగమ్మ , పైడితల్లి, పోలమ్మ వంటి దేవతలను పూజించే సాంప్రాదాయాలు కనుమరుగువు తాయన్నారు. తవ్వకాలకు మండల, జిల్లా స్దాయి అధికారులు అనుకూల నివేదిక లిచ్చారన్నారు. వందలాది గిరిజన కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం వుందన్నారు. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయుకులు జి.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు బి.పుష్పారావు, పి.సింహాచలం, జి.తిరుపతి నాయుడు పాల్గొన్నారు.