గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ

గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ సిపిఎం, వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన 'చలో భీమవరం' కార్యక్రమాన్ని పోలీసులు ఉద్రిక్తంగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సహా 151 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాలుగురోజుల కిందటే 'చలో భీమవరం' కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా నోరు విప్పని పోలీసులు చివరి నిమిషంలో సభకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు యత్నించారు. మంగళవారం సాయంత్రం నుంచే భీమవరం, గరగపర్రులో భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు. సభా ప్రాంగణమైన భీమవరం పాత బస్టాండ్‌ వద్ద వందలాదిమంది పోలీసులు మోహరించి, ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గరగపర్రు నుంచి దళితులంతా ర్యాలీగా భీమవరం వచ్చేందుకు బయలుదేరగా అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి పివి రామకృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు చుట్టుముట్టగా మహిళలంతా పెద్దఎత్తున ప్రతిఘటించారు.