కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జైల్ భరో

మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ విమర్శించారు. కేంద్ర కార్మిక, రైతాంగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కర్నూల్లో జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా కార్మిక కర్షకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.ఈ సందర్భంగా పోలీసులు కార్మిక, రైతాంగ సంఘాల నాయకులను అరెస్టు చేసి మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు పండించిన పంటలకు 50 శాతం అదనంగా మద్దతు ధర కల్పిస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని అన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలన్నీ ఎండిపోయాయని, పశ్చిమ ప్రాంతంలో పూర్తిగా కరువు నెలకొందన్నారు. కానీ జిల్లాలో కేవలం 37 మండలాల్లోనే కరువు మండలాలుగా ప్రకటించడం బాధాకరమన్నారు. జిల్లా అంతటిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.