కార్పొరేట్ క‌నుస‌న్నలో మీడియా..

కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో నడుస్తున్న ప్రధాన మీడియా కీలకమైన ప్రజాసమస్యలను విస్మరిస్తోందని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ప్రజాశక్తి 35వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 'వర్తమాన పరిస్థితులు-మీడియా' అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కార్పొ రట్లకు, రాజకీయనేతలకు మధ్య అపవిత్ర పొత్తు నెల కొందని, అదే పరిస్థితి మీడియా రంగానికి వ్యాపించిందని చెప్పారు. వ్యాపారస్తులే మంత్రులుగా మారుతున్నారని, మీడియా సంస్థలనూ ఏర్పాట చేస్తున్నారని చెప్పారు. ఫలితంగా సొంత లాభం కోసం దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నా ప్రశ్నించలేని స్థితికి మీడియా చేరుకుందన్నారు. గత ఎన్నికల్లో కార్పొరేట్లతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధాన మీడియా మోడికి అనుకూలంగా ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మోడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా అదే విధమైన ధోరణి కొనసాగుతోందని అన్నారు. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా మతోన్మాద దాడులు పెరిగాయని వీటి గురించి ప్రస్తావన కూడా మీడియాలో ఉండటం లేదని అన్నారు. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకోసం నిర్వహించే సర్వేల ప్రచురణలకు ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న రైతాంగ ఆత్మహత్యల పట్ల కూడా మీడియా ఇదే ధోరణి అవలంభిస్తోందని చెప్పారు. మహారాష్ట్రలోని విదర్భతో పాటు గతంలో ఎప్పుడూ జరగని ప్రాంతాల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మోడీ అధికారంలోకొచ్చిన తరువాత దేశంలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయని, వీటిగురించి ఎక్కడా ప్రస్తావించడం లేదని అన్నారు. రైతుల ఆత్మహత్యలతో పాటు సామాజిక సమస్యలపై లోతైన విశ్లేషణ జరపడం లేదని పేర్కొన్నారు. వార్తలనూ వ్యాపార సరుకుగా చూడటమే దీనికి కారణమని వివరించారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా ఉధృతమైన మార్కెట్‌ వ్యవస్థ మీడియారంగంలోనూ ప్రవేశించడంతో ప్రజల సమస్యలు విస్మరణకు గురవుతున్నాయని చెప్పారు. అదే సమయంలో మోడి సర్కారు నియంతృత్వ ధోరణిని మీడియా ప్రశ్నించలేకపోతోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి సంస్థలూ ప్రభుత్వ మద్దతుతో భావ ప్రకటనాస్వేచ్ఛపై దాడిచేస్తున్నాయని తెలిపారు. ఐఐటి, ఐఐఎం, చారిత్రక పరిశోధనా సంస్థ వంటి వాటిల్లో వారి సొంత మనుషులను నియమించుకుంటోందని తెలిపారు. ఇష్టంలేని వార్తలు ప్రచురిస్తున్న, ప్రసారం చేస్తున్న సంస్థలపై భధ్రత పేరుతో దాడికి దిగుతున్నాయని, తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేయడం దీనిలో భాగమేనని పేర్కొన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె సంస్థలోకి రూ.2.50 కోట్లు నిధులొచ్చాయనే పేరుతో ఆమెపై సిబిఐ కేసులు పెట్టి వేధిస్తోందని తెలిపారు. సన్‌ నెట్‌ వర్క్‌పై కూడా ఇదే విధమైన దాడి జరిగిందన్నారు. అయితే, లౌకికతత్వానికి సంబంధించిన అంశాల్లో మీడియా ఇప్పటికీ ఎంతోకొంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. మీడియా నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చను ప్రస్తావించిన ఆయన దీనికోసం స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాల్సిఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వానికి ఏ విధమైన అధికారమూ, అజమాయిషి ఉండకూడదని సూచించారు. ఈ తరహా సంస్థపై మరింత చర్చ జరగాల్సిఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఎస్‌. వెంకట్రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజల్‌ పి. ప్రభాకర్‌ పాల్గొన్నారు. ప్రజాశక్తి సాహితీసంస్థ ఛైర్మన్‌ వి. కృష్ణయ ఆహుతులను వేదికపైకి ఆహ్వానించారు.