"అవినీతి -కార్పొరేట్ రాజకీయాలు - ఫ్రత్యామ్నాయం"

దేశ రాజకీయాలను అవినీతిమయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్‌ సంస్థల అధినేతల కాళ్లు రుద్దే పనిలో నేటి పాలకులు నిమగమయ్యారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. 'అవినీతి -కార్పొరేట్‌ రాజకీయాలు- ప్రత్యామ్నాయం' అనే అంశంపై సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సదస్సు జరిగింది. పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ రాజకీయాల్లోకి కార్పొరేట్‌ శక్తులు చొరబడిన తరువాత అవినీతికి అడ్డే లేకుండా పోయిందన్నారు. దీనిద్వారా చట్టసభల్లోకి వెళ్లి అక్కడ నుంచి వేల కోట్లు దోచుకోవడమేగాక సభలనూ నియంత్రిస్తున్నారని చెప్పారు. అటువంటి వారి కాళ్లు రుద్దేపనిలో ప్రస్తుత పాలకులు నిమగమై ఉన్నారని పేర్కొన్నారు. తొందరగా సంపద కూడబెట్టే మార్గంగా రాజకీయాలను ఎన్నుకున్నారని, దీనికోసం కొంత డబ్బును వెదజల్లేందుకూ వెనుకాడటం లేదని అన్నారు. అధికారంలోకి రాకముందు అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని, నల్లడబ్బును తెస్తామని హామీలిచ్చిన బిజెపి అనంతరం దాన్ని మర్చిపోయిందని చెప్పారు. అదానీ, రిలయన్స్‌ లాంటి సంస్థల కోటీశ్వరులు ముందుకు వచ్చారని తెలిపారు. దీనికితోడు ఇడి అవినీతిపరుడిగా పేర్కొని, పాస్‌పోర్టును సీజ్‌ చేయాలని చెప్పిన లలిత్‌మోడీకి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, ముఖ్యమంత్రి వసుంధరరాజే, వారికి మద్దతుగా ప్రధాని మోడీ బహిరంగంగా మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. యుపిఏ ప్రభుత్వంలో ఐదేళ్ల తరువాత అవినీతి బయటపడితే బిజెపి హయాంలో ఏడాదిలోనే బయటకొ చ్చిందన్నారు. మోడీని గొప్ప పరిపాలనాదక్షుడిగా సోషల్‌ మీడియాలో బిజెపి చేయించిన ప్రచారం ఒక్క ఏడాదితో వెనక్కుపోయిందని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, దీని నుంచి బయటపడేందుకు సెక్షన్‌-8 అంశాన్ని ముందుకు తెచ్చిందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించాలని, రాజకీయ అవినీతిని నిలువరించాలని అన్నారు.