అనంత' సమస్యలపై నిలదీద్దాం

నిత్యమూ కరువు దుర్భిక్షానికి నిలయమైన అనంతపురం జిల్లా సమస్యలపై నిలదీసేందుకు తమతో కలసి రావాలని సిపిఎం, సిపిఐ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాయలసీమ వెనుకబాటుతనంపై రెండు పార్టీలు సంయుక్తం చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం రాత్రికే కదిరి పట్టణానికి చేరుకుంది. శనివారం ఉదయం కదిరి పట్టణంలో ప్రారంభమైన బస్సు యాత్ర ఓబుళదేవరచెరువు, నల్లమాడ, బుక్కపట్నం మీదుగా రాత్రికి పుట్టపర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు బస్సుయాత్ర వెళ్లిన సందర్భంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజానాట్యమండలి కళాకారులు చేపట్టిన ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఓబుళదేవరచెరువులో అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. బుక్కపట్నంలో ఎంకె.దాసప్ప, గణేనాయక్‌ స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాత్ర సందర్భంగా పలుచోట్ల ప్రజలను ఉద్ధేశించి నాయకులు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోనున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల్లోని వారిని తమ పార్టీలోకి ఏ విధంగా చేర్చుకోవాలన్న దానిపై దృష్టి సారించినంతగా ప్రజాసమస్యల పరిష్కారం పట్ల పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంగానున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతం నుంచే ఆరుగురు ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తుచేశారు. 30 ఏళ్లకుపైగా ఈ ప్రాంతం వారే పాలించినా రాయలసీమ సమస్యలను వారు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాయలసీమ అభివృద్ధి కోసం పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు కదలిరావాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుబడి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని, ప్రత్యేక హౌదా కల్పిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వాటిల్లో దేన్ని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం శోచనీయమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్‌ చేయాల్సిన అవసరముందని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి కూడా రాయలసీమ సమస్యలపై మాట్లాడలేకపోవడం శోచనీయమని అన్నారు. సిపిఎం రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ జి.ఓబుళు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 165 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళీ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం నుంచి వలసలను నివారించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో అనేక మంది కేరళ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి బిక్షమెత్తుకునే దయనీయ స్థితి అనంతపురం జిల్లాలో నెలకొందన్నారు. పరిశ్రమలు నెలకొల్పుతామని గత ప్రభుత్వ హయము నుంచి ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఓడిసి ప్రాంతంలో లక్ష కోట్లతో సైన్సు సిటీని ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కాని ఆచరణలో ఏర్పాటు జరగలేదు.ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేక హామీలిచ్చింది... ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. ఒట్టిమాటలు చెప్పి.. మోసం చేసే ఈ ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలంటే పోరాటాలు చేయకతప్పదని ప్రజలకు పిలుపునిచ్చారు.అందుకే వామపక్షాల ఆధ్వర్యంలో మార్చి 15న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతవాసులంతా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, సహాయ కార్యదర్శి నారాయణస్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇంతియాజ్‌, కొండారెడ్డిలు పాల్గొన్నారు.
సోలార్‌ భూనిర్వాసితుల న్యాయం జరిగే వరకు పోరాడుతాం
నంబులపూలకుంటలో సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నిర్వాసితుల తరుపున పోరాటాన్ని విరమించబోమని హెచ్చరించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కదిరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన సోలార్‌ నిర్వాసితులను ఉద్ధేశించి మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా నంబులపూలకుంటలో ప్రభుత్వం అడ్డుగోలుగా సేకరణను చేపట్టిందని విమర్శించారు. పట్టావున్న వారికే కాకుండా సాగుదారులకుయ పరిహారం చెల్లించే వరకు పోరాటాన్ని ఆపబోమని హెచ్చరించారు. ఎకరానికి పది లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆయన సోలార్‌ భూములపై మాట్లాడుతున్న సమయంలో స్థానికుల చప్పట్లో హార్షధ్వానాలు తెలియజేశారు. సోలార్‌ భూముల విషయంపై ముందు నుంచి సిపిఎం పోరాటాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే.
నేడు బస్సుయాత్ర జరిగే ప్రాంతాలివే...
సిపిఎం, సిపిఐలు సంయుక్తంగా చేపట్టిన బస్సుయాత్ర నేడు ఈ విధంగా జరగనుంది. ఆదివారం ఉదయం పుట్టపర్తిలో ప్రారంభమై కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి మీదుగా రాప్తాడుకు చేరనుంది. అక్కడి నుంచి సాయంత్రానికి అనంతపురం నగరానికి చేరనుంది. అనంతపురం నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట రెండు పార్టీల ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు,